Dear Prakash Sir

ఏకబిగిన ఒక పుస్తకంలో వంద పేజీలు  చదివి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తు లేదు సార్, అది నిన్న జరిగింది. పుస్తకం చదివి చాలా రోజులవుతోంది అనిపించి రోహిత్ ఇంట్లోంచి రెండు మూడేళ్ళ క్రితం ఎత్తుకొచ్చిన “పతంజలి సాహిత్యం” రెండవ సంపుటం కోసం వెతుకుతుంటే మీ “ఏలూరు రోడ్ ఆత్మగీతం” దొరికింది. ఇది నా దగ్గరకి ఎప్పుడొచ్చిందో గుర్తు రాలేదు, ఉత్సాహం కొద్దీ తెచ్చుకోవడమే గానీ youtube వ్యసనం వల్ల ఏమీ చదవలేని నిస్సత్తువ. పతంజలిని మెల్లిగా చదువుదాం అని మిమ్మల్ని చదవటం మొదలుపెట్టాను, Facebook లో 4-5 చదివినట్టున్నా, ఆ తర్వాత సామాజిక మాధ్యమ వ్యసనం నుంచి దూరమయిన క్రమంలో మీ రాతలు మిస్ అయ్యా. ఒకవేళ చదివినప్పటికీ వయసు మరియు  మద్యం ప్రభావం వల్ల మతిమరుపు కారణంగా మర్చిపోయానేమో అన్నీ మొదటిసారి చదువుతున్నట్టే అనిపించింది. ఈరోజు ఇంకొక నూట ముప్పై పేజీలు చదివేసా, నామీద నాకే ముచ్చటేసింది, ఇంత ‘ఉన్మాదంగా’ పూర్తిగా పుస్తకంలో కూరుకుపోయి చదువుతుంటే కలిగే ఆనందం మళ్ళీ ఇన్నాళ్లకు ప్రాప్తించింది సార్ మీ రాతల వల్ల, భావప్రాప్తి అనొచ్చంటారా? అనేస్తాను పోయేదేముంది.

ఏదేదో రాయాలని ఇందాకే టీ తాగుతూ దమ్ము కొడుతూ చాలా అనుకున్నాను, వాక్యాలు  ‘ఫ్రేమ్’ చేసుకున్నాను, ఇప్పుడేమో అవన్నీ సిల్లీగా  అనిపిస్తున్నాయి. మా నాన్న film distributor అవడం వల్ల చిన్నప్పట్నుంచి వార్తాపత్రికలు చదివే అలవాటు ఉన్నా 1988 నుంచి అన్ని దినపత్రికలు పూర్తిగా ఏదీ వదలకుండా చదివేవాణ్ణి, ఆ సంవత్సరమే మేము తిరుపతికి షిఫ్ట్ అయ్యాము. కాబట్టి నేను మీరు రాసినవి చదివే ఉంటాను అని ఆనందం వేసింది. ముఖ్యంగా ‘ఉదయం’ అప్పట్లో అది నా ఫేవరేట్, ఎందుకో తెలియదు కానీ ఇదేదో different గా ఉందే అనిపించింది అంతే.

ఇందుకే రాయాలని కూర్చోకూడదు, అనిపించినపుడే రాయాలి, నా రచనా talent ని showoff చేద్దాం అనుకున్నా, ఏం రాయగలను మీ గురించి మీ ఆర్టికల్స్ గురించి, అర్జెంటుగా వచ్చి మీతో బీరు తాగాలని ఉంది, కానీ మా ఇల్లేమో దూరం దారంతా ట్రాఫిక్కు మండే ఎండలు ఖాళీ జేబులు. ఇప్పుడొక సిగరెట్ తాగాల్సిందే.

వుడీ అలెన్ “Midnight in paris” చూసే ఉంటారు అనుకుంట, దాంట్లో హీరో paris వీధుల్లో తిరుగుతుంటే కొందరు అపరిచుతులు కార్లో వచ్చి అతన్ని ఒక పార్టీకి తీసుకెళ్తారు, అక్కడ అందరూ 1920ల నాటి సంగీతకారులు రచయితలు ఉంటారు, వాళ్ళతో హీరో కబుర్లు చెప్పుకుంటూ ఆనందపడిపోతుంటాడు.  ఈ సినిమాని “అర్ధరాత్రి బెజవాడలో” అని తీయాలని నేనూ రోహిత్ సరదాగా అనుకుంటుంటాం, హీరో రిక్షా ఎక్కి వెళ్లి ఒక బార్ ముందు దిగితే ఆ బార్ లో శ్రీశ్రీ నుంచి ఇంకా ఎందరో ఆ తరం ఇంకా ముందు తరం వాళ్ళు పార్టీ చేసుకుంటుంటారు. “ఏలూరు రోడ్ ఆత్మగీతం” చదువుతుంటే అలానే అనిపించింది, ఆ హీరో మీరే, ఏలూరు రోడ్డే ఆ పారిస్.

ఒక చిన్న విన్నపం సార్, మీతో ఎప్పట్నుంచో ఒక podcast చేద్దామని ఉంది, చూసేది కాదు కేవలం వినేది, ఒక మండే మధ్యాహ్నం చల్లటి బీర్లు చికెను ఒక రికార్డర్ పెట్టుకుని కూర్చుందాం, బీరెక్కే కొద్దీ నాకు తోచిన పిచ్చి ప్రశ్నలేవో అడుగుతాను మీరు ‘ఔదార్యం’ తో ఏదోటి చెప్పండి.

ఇట్లు మీ
అభిమాని కం మిత్రుడు
శశి

Note : Anvikshiki వారికి ముఖ్యంగా మిత్రుడు వెంకట్ సిద్దారెడ్డికి ప్రత్యేక కృతఙ్ఞతలు