మెట్రో బతుకులు

తెల్లవారుజామున తొమ్మిదింటికి లేచి మొహం కడుగుతుంటే ఆ శబ్దానికి పవన్ నిద్ర లెగుస్తాడు, “కేఫ్ కి వస్తావా” ఇది నేను వాడిని, వాడు నన్ను అడిగే రొటీన్ ప్రశ్న, “ఐదు నిమిషాలు అన్నా” అని వాడు రెడీ అయేలోపు ఒక సిగరెట్ కొడతా, ఇద్దరం ఈసురోమంటూ కేఫ్ వైపు నడుస్తాం. అప్పటికింకా పెద్దగా జనం ఉండరు, దొరికితే మా ఫేవరెట్ టేబుల్ లేకపోతే దొరికిన టేబుల్లో సెటిల్ అవుతాం. అప్పటికి సర్వర్ ఖాజా రాడు కాబట్టి మేమే చాయ్ తెచ్చుకోవాలి, without sugar అనే concept ఉండదు కేఫుల్లో, మరుగుతున్న పాలల్లో ప్రేమతో కలిపేసిన అమితమైన చక్కర ఉంటుంది, పక్కనే మరుగుతున్న డికాక్షన్ కలిపి చాయ్ ఇచ్చేస్తారు. నేను కరోనా టైంలో షుగర్ మానేసాను, so “దో సింగల్ ఏక్ కడక్ బనావ్” అని చెప్పి ఆ చాయ్ లు తెచ్చుకుని కూర్చుంటాం. రాత్రి మత్తు నిద్ర మత్తు వదలక మాట్లాడుకోవటానికి ఏమీ లేక దీర్ఘాలోచనలో ఉన్న మేధావుల్లా చాయ్ తాగుతూ సిగరెట్లు అంటిస్తాం. చలికాలం, వర్షాకాలం ఉదయాలు పర్లేదు కానీ ఎండాకాలం తొమ్మిదింటికే మండుతున్న వేడిలో చాయ్ తాగటం ఒకలా ఉంటుంది, ఎలా ఉన్నా, జేబులో ఉడిపి హోటల్ కి వెళ్లగలిగే డబ్బులున్నా మెట్రో వైపే లాగుతాయి కాళ్లు.

రోడ్డు మీద ట్రాఫిక్ ని చూస్తూ పక్క టేబుళ్ల మీద ఒక లుక్కేస్తూ మొదటి చాయ్ అయిపోతుంది, అప్పుడు మాటలు మొదలవుతాయి “రాత్రి బాగా ఎక్కువైంది అన్నా” అని పవన్ “అవును ఈరోజు నుంచి ఎవడినీ రానీయకూడదు రూమ్ కి, ఒకడి తర్వాత ఒకడు మందు పట్టుకొస్తూనే ఉన్నారు” అని నేను. ఇలా ఎవ్వడినీ రానివ్వకూడదు అనే ప్రిన్సిపల్ మూడేళ్ళుగా అమలు చేద్దామనుకుంటూనే ఉన్నా అది జరగదు. “షేర్ చేస్తావా ఇంకో చాయ్” అని నేను అడిగితే వాడు కాదనడు, అలా ఇంకో చాయ్ సిగరెట్. మరుగుతున్న నూనెలో కాలిన పూరీలకి తెగ డిమాండ్ మెట్రోలో, అవి తింటున్న వాళ్ళని చూసి నాకూ నోరూరి, “పూరికి డబ్బులున్నాయా” అని వాడిని అడుగుతా, “నువ్వు తీసుకో అన్నా నేను చూసుకుంటా” అంటాడు పవన్, కేఫేదో వాడి సొంతమైనట్టు. నాలుగు పూరీలు తినలేనులే అని వాడు రెండు నేను రెండు షేరింగ్, ఇంకో రెండు తినాలనిపిస్తుంది, అలా నాలుగు పూరీలు తిని హమ్మయ్య, లంచ్ దాకా ఢోకా లేదనుకుని, పక్కన పాన్ డబ్బాలో అప్పు చేసి సిగరెట్లు కొనుక్కుని రూమ్ కి వస్తాం. అప్పటికే దగ్గరదగ్గర గంట గడిచిపోతుంది.

మధ్యాహ్నం పన్నెండు, ఏం తోచక అటు ఇటు తిరుగుతూ హాల్లో చెస్ ఆడుకుంటున్న పవన్ తో “కేఫ్ కి వెళ్దామా” అడుగుతా నేను, నావైపు చూసి ఒక చిలిపి నవ్వు నవ్వి “పదన్నా” అంటాడు, ఆ ఎండలో అవసరమా ఇప్పుడు అనుకుంటూనే కేఫ్ కి చేరుకుంటాం. Mostly క్రిక్కిరిసిపోయుంటుంది ఆ టైంలో, ఎందుకొచ్చాం రా బాబు అనుకుంటూ ఎంటరవుతుంటే, ఏదో ఒక టేబుల్లో రాజశేఖర్, హరికాంత్, రాజేష్, రఫీ, స్కై, ఇలా ఐదుగురు ఇరుక్కుని కూర్చుని ఉంటారు, నన్ను చూడగానే ఎధవ గౌరవంతో నాకూ చోటిస్తారు, గౌరవం బానే ఉంటుంది కానీ బాగా ఇబ్బంది పెడుతుంది. అలా ఇరుక్కుని అక్కడ ఎవడి పెట్టెలో సిగరెట్ ఉంటే అది తీసుకుని అంటించి మళ్ళీ ఇంకో చాయ్. వాళ్ళందరూ అప్పటికే తాగేసుంటారు చాయ్, కానీ గబ్బిలాల్లా వదలరు కేఫ్ ని. అలాంటి మాలాంటి సినీ గబ్బిలాలు చాలానే ఉంటాయి, కాసేపు ఎందుకూ పనికిరాని ముచ్చట్లు. ఈలోపు సర్వర్ ఖాజా ప్రతి టేబుల్ కి వెళ్లి “లంచ్ టైమైంది టేబుల్ ఖాళీ చేయండి” అని announcement చేసుకుంటూ కేఫ్ అంతా తిరుగుతాడు.

సాయంత్రం నాలుగు, మళ్ళీ కేఫ్ కి మేమిద్దరం, ఆ టైంలో mostly ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా ఒక అరగంట గడిపి చాయ్ సిగరెట్ కొట్టి, రూమ్ కి వెళ్లి ఏం చేయాలో అర్ధం కాక, “కూర్చుందాంలే అన్నా కాసేపు” అని పవన్ అంటే, సరే అని ఇంకొంచెం టైం కిల్లింగ్ అక్కడే.

మెట్రోపాలిటన్ కేఫ్ అనే కాదు ప్రతి కేఫు ఒక వ్యసనమే, అక్కడ చాయ్ ఒక వ్యసనం, ఉస్మానియా బిస్కెట్ సమోసాలొక వ్యసనం, అక్కడ కూర్చుని పెట్టే ముచ్చట్లు ఒక వ్యసనం. ఎటుపోవాలో ఏం చేయాలో తెలియని వాడికి అదొక తాత్కాలిక షెల్టర్. కేఫులకి అమ్మాయిలు రావడం అరుదు, అలా వచ్చిన అమ్మాయి వైపు తలలన్నీ తిరుగుతాయి, ఇంక ఆ అమ్మాయి చాయ్ తో పాటు సిగరెట్ అంటించిందో నిర్మొహమాటంగా తల తిప్పకుండా ఆ అమ్మాయి వైపు చూసే మగ కళ్ళు ఎన్నో. నా మధ్య తరగతి మైండ్ ఇప్పటికీ అమ్మాయితో కేఫ్ కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూనే ఉంటుంది, ఆ ఏముందిలే అనుకుని వెళ్తే ఆ చూపులు చూస్తుంటే, అలా చూడకండిరా అని అరచి చెప్పాలి అనిపిస్తుంది, మరి నువ్వు చూసినప్పుడో అనే ప్రశ్న వెంటనే నన్ను ప్రశ్నిస్తుంది.

రోహిత్ నేనూ కేఫ్ లో కడతేర్చిన కథలెన్నో! రెండేళ్లుగా రోహిత్ కి ఒక వింత అలవాటు మొదలైంది, బేగంపేట్ నుంచి సాయంత్రం అవంతికి వస్తాడు, దారిలోనే మెట్రో కేఫ్, కానీ వెళ్ళడు. వచ్చి పవన్ ని లేదా ఎవరుంటే వాళ్ళని చాయ్ తెమ్మంటాడు, నేను పెడతాను రోహిత్ చాయ్ అంటే వద్దు నాకు ఆ చాయే కావాలి అని మారాం చేస్తాడు. ఇక్కడ్నుంచి హడావిడి మొదలు, పవన్ ఎవరో ఒకరికి ఫోన్ చేసి, “అరేయ్ కేఫ్ దగ్గరున్నావా, రోహిత్ అన్నకి చాయ్ కావాలంట, ఆ తీస్కో రెండు సమోసాలు కూడా” అని ఆర్డర్ ఇస్తుంటే రోహిత్ “ఒక లైట్స్ సిగరెట్” అని ఆర్డర్ extend చేస్తాడు. ఇంక కేఫ్ దగ్గర హడావిడి మొదలు, కౌంటర్ లో ఉన్న జనాల్ని తోసుకుని ఒకడు చాయ్ సిగరెట్ సమోసా పట్టుకొస్తాడు. ఎంత ప్రేమరా మీ రోహిత్ అన్నంటే మీకు అనుకుని నా పెగ్ ఫిక్స్ చేసుకుంటా.

గత పదిహేనేళ్లలో లక్ష నిమిషాలన్నా మెట్రో కేఫులో గడచిపోయాయేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *