2014లో ఒక వర్షం కురుస్తున్న రాత్రి రాహుల్ రామకృష్ణ తో ఏదో మాటల్లో “కొమరం భీం” మీద సినిమా తీద్దామని అనుకుంటున్నా అని చెప్పా, తనకే ఎందుకు చెప్పానంటే అప్పట్లో రామకృష్ణ ఆదివాసీలు దళితులకి సంబంధించిన కార్యక్రమాల్లో active గా ఉండేవాడు, ఏదో ngo కి పని చేసేవాడనుకుంట.చలికాలంలో ఆదిలాబాద్ అడవుల్లో సినిమా తీయాలన్నది నా ఐడియా. అప్పటికే అల్లాణి శ్రీధర్ గారు తీసారు, రిలీజ్ అయిందో లేదో తెలియదు. నేను తీయాలనుకున్నది భీం బయో పిక్ కాదు, నిజాంకి వ్యతిరేకంగా చేసిన ఒక attack, దానికి భీం అతని అనుచరుల planning & execution సినిమాగా తీయాలన్నది నా ప్లాన్, ఒక గెరిల్లా యుద్ధం లాంటిది. అన్నిటికన్నా నాకు ఈ ప్రాజెక్టులో exciting గా అనిపించింది ఈ సినిమా ని గోండ్ భాషలో ఆ నటులనే పెట్టి తీయాలన్నది, వాళ్లకి కొన్ని రోజులు training ఇచ్చి, కాకతీయ యూనివర్సిటీ లో ఒక professor గోండు భాష మీద extensive research చేసి దానికి లిపి సృష్టించాడు, ఇలాంటి విషయం ఒకటి విన్నా. ఆయన్ని కలుద్దామనుకున్నా, కొంత రీసెర్చ్ మొదలుపెట్టి మధ్యలో వదిలేసా, ఇది ఇప్పుడు కాదు నేనొక హిట్టు కొట్టి నేను అడిగిన బడ్జెట్ దొరికితేనే తీయగలను అనిపించింది. భారీ బడ్జెట్ కూడా కాదు మహా అయితే మూడు కోట్లు, గోండ్ భాషలో సినిమా అంటేనే ఎవడూ పెట్టడు అలాంటిది మూడు కోట్లే అని సింపుల్ గా చెప్పేసా కదా, నా దృష్టిలో ఇదొక ఇంటర్నేషనల్ ఫిలిం, ఖచ్చితంగా మార్కెట్ అవుతుందని అప్పటి నా నమ్మకం, ఇప్పటికీ ఉంది.
చలికాలం వస్తున్నప్పుడల్లా ఆ సినిమా గుర్తొస్తుంది, online ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటా. అలా చదువుతున్నపుడు దొరికిన కొన్ని విషయాలు రాయాలనిపించింది. కొమరం భీం ఇచ్చిన “జల్ జంగిల్ జమీన్” అనే నినాదం చాలు అతనెంత పెద్ద పోరాటానికి సిద్దమయ్యాడో అర్ధమవటానికి. అడవులు అక్కడి వనరులు ఆదివాసీలకు మాత్రమే చెందాలనే భీం పోరాటం.
చదువులేదు,బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగిన అడవి బిడ్డ కొమరం భీం, అతను చూసిందల్లా ఆదివాసీలకి జరిగిన అన్యాయాలు. పోడు వ్యవసాయం చేసుకుని బతికే ఆదివాసీలను నిజాం అధికారులు పోలీసులు వేధింపులకి గురి చేస్తుంటే తిరగబడ్డ కొమరం భీం తండ్రిని చంపేశారు, అప్పుడు అతని కుటుంబంతో కలిసి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు.
1940లో గోండులు వ్యవసాయం చేసుకుని పంట కోస్తున్న సమయంలో పట్వారి లక్ష్మణ్ రావు , నిజాం పట్టాదార్ సిద్దికి సాబ్ అనే వ్యక్తులు పది మంది వచ్చి పంటకి పన్ను కట్టమని వేధిస్తుంటే గోండులు తిరగబడ్డారు, ఆ పోరాటం లో కొమరం భీం చేతిలో సిద్ధికి సాబ్ అనేవాడు చచ్చాడు. ఆ సంఘటన తర్వాత కొండల్ అనే ఫ్రెండ్ తో భీం పారిపోయాడు. వారికి అప్పుడు విఠోబా అనే ప్రెస్ ఓనర్ పరిచయం అయి తనతో తీసుకెళ్లాడు, విఠోబా బ్రిటిష్ వారికి నిజాం కి వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. అతనితో ఉన్నప్పుడే భీం ఇంగ్లీష్ ఉర్దూ హిందీ నేర్చుకున్నాడు. కొన్ని రోజులకి విఠోబాని అరెస్ట్ చేసి నడుపుతున్న ప్రెస్ ని మూసేసారు.
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పరిచయమైన ఒక వ్యక్తి ద్వారా అస్సాం వెళ్లిన భీం అక్కడ నాలుగున్నర ఏళ్ళు టీ ప్లాంటేషన్స్ లో పని చేసాడు, అక్కడా పోరాటమే, వర్కర్స్ అందరిని కూడగట్టి యజమానులకి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయ్యాడు. కానీ నాలుగు రోజులకి జైలు నుంచి తప్పించుకుని గూడ్స్ ట్రైన్లో బలార్షా చేరుకున్నాడు. అస్సాం లో ఉన్నపుడే ఆదివాసీల కోసం సీతారామరాజు చేస్తున్న పోరాటం గురించి విన్నాడు, అంతే కాకుండా నిజాం అకృత్యాలకు వ్యతిరేకంగా రాంజీ గోండు చేసిన పోరాటం కూడా భీం కి తెలుసు.
జోడే ఘాట్ సెంటర్ గా చేసుకుని నిజాం ప్రభుత్వం, జమీందార్లకి వ్యతిరేకంగా 1928-1940 వరకు కొమరం భీం చేసిన గెరిల్లా యుద్ధం పాలకులని వణికించింది, ఏదో విధంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు కానీ భీం ఒప్పుకోలేదు. ఆదివాసీలని తన ప్రసంగాలతో ఉత్తేజపరిచాడు, పోరాటంలోకి దించాడు, “జల్ జంగిల్ జమీన్” అని నినదించాడు.
నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro