లెక్కల కుందేలు

  • ఎవా వసిలివిస్కాయా 

అనగనగా ఒక అడవిలో ఓ కుందేలు నివసించేది. దానికి ఐదుగురు పిల్లలు. ఆఖరి బుజ్జి కుందేలు పేరు ‘విల్లీ’. 

చిన్నప్పుడు ఎవరైనా సరే అల్లరి చేస్తూ, అరుస్తూ, గెంతుతూ ఆడుకుంటారు కదా!

కానీ బుజ్జి కుందేలు మాత్రం అవేమి చేసేది కాదు, దానికి లెక్కపెట్టడం అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే లెక్కపెట్టడం కోసం అది తన సోదరులతో ఆటలు కూడా ఆడేది కాదు. అల్లరి చేసేది కాదు. 

ప్రతిరోజు ఉదయాన్నే అది వాళ్ళ ఇంటి తలుపు బయట కూర్చునేది. దేనిని లెక్కపెడదాం అని కొద్దిసేపు ఆలోచించేది. ఓ రోజు ఇలాగే ఆలోచిస్తూ ఉండగా, వాళ్ళ ఇంటి ముందు నుండి ఓ గొంగళి పురుగు వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది. గొంగళి పురుగుని చూడగానే బుజ్జి కుందేలు ఆనందించింది. 

కుందేలు గొంగళి పురుగు కాళ్ళను ఇలా లెక్కించసాగింది. 

“ఒక కాలు, రెండు కాళ్ళు, మూడు కాళ్ళు….., నాలుగు….”

“నాలుగు…” అని లెక్కపెట్టే లోపల గొంగళి పురుగు వెళ్ళిపోయింది. పోనీలే ఏం పర్లేదు. గొంగళి పురుగు వేగంగా వెళ్ళిపోయింది. కొంచెం నెమ్మదిగా నడిచేదాన్ని లెక్కపెడతాను అనుకుని చుట్టూ చూసింది. 

ఎదురుగా ఓ చెట్టు తొర్రలో వున్నా పక్షి గూడులో నీలం రంగులో వున్నా గుడ్లు కనిపించాయి. ఆ గుడ్లు మెత్తటి గడ్డిపై ఉన్నాయి. వాటిని చూడగానే బుజ్జి కుందేలు భలే ఆనందించింది. ఇవి వేగంగా పరిగెత్తలేవు. నేనిప్పుడు ప్రశాంతంగా లెక్కపెట్టవచ్చు అనుకుంది. 

కుందేలు నీలం గుడ్లను ఇలా లెక్కించసాగింది. “ఒక చిన్న గుడ్డు, రెండు చిన్న గుడ్లు, మూడు చిన్న గుడ్లు, నాలుగు…..” క్షణాల్లో తల్లి పక్షి వచ్చి గుడ్లపై కూర్చుని కుందేలును గుర్రుగా చూసింది. 

“ఏం చేస్తున్నావిక్కడ?” అని కోపంగా ప్రశ్నించింది తల్లి పక్షి. 

గుడ్లు లెక్కపెడుతున్నానని చెప్పడానికి ప్రయత్నించింది కుందేలు, తన గుడ్ల జోలికి వస్తే అంతుచూస్తానని హెచ్చరించింది తల్లి పక్షి. 

బెదిరిపోయింది బుజ్జి కుందేలు. దిగులుగా తల వంచుకుని ఇంటిదారి పట్టింది. 

అలా నడుస్తూ ఉండగా అక్కడ మొక్కజొన్న విత్తనాలు భూమిపై చల్లినట్లు పడి వున్నాయి. వాటిని చూడగానే బుజ్జి కుందేలు ఆనందించింది. ఆలస్యం చేయకుండా వాటిని లెక్కించసాగింది. 

“ఒక విత్తనం, రెండు విధానాలు, మూడు విత్తనాలు,నాలుగు….”

ఎక్కడి నుండి వచ్చాయో, ఓ పావురాల గుంపు వచ్చి ఆ విత్తనాలపై వాలాయి. క్షణాల్లో విత్తనాలన్నీ తినేసి చక్క ఎగిరిపోయాయి. 

బుజ్జి కుందేలు ఎంతో బాధపడింది. ఏడ్చింది. తనకు లెక్కించడానికి వచ్చిన ప్రతి అవకాశమూ, చేజారిపోతున్నందుకు అది చింతించింది. ఇంటికి చేరింది. 

సాయంత్రానికి తన సోదరులైన ఇతర కుందేళ్లు, తల్లి కుందేలూ ఇల్లు చేరాయి. భోజనాలయ్యాక, మిగతా కుందేళ్లు ఆటలాడసాగాయి. బుజ్జి కుందేలు చెవిని లాగాయి, కాలిని గోకాయి. కానీ బుజ్జి కుందేలు స్పందించలేదు. 

“ఆపండి పిల్లలూ!బుజ్జిగాడు అలసిపోయినట్లున్నాడు. వాడిని ప్రశాంతంగా వుండనివ్వండి” అంది తల్లి కుందేలు. 

బుజ్జి కుందేలుని తల్లి ఒడిలో పడుకోబెట్టుకుంది. జోల పాత పాడసాగింది. బుజ్జిగాడికి అమ్మ ఒళ్ళో వెచ్చగా, హాయిగా వుంది. జోలపాటకు దానికళ్ళు మూతపడసాగాయి. బుజ్జి కుందేలు తలుపు బయటకు చూసింది. పైన ఆకాశంలో బోలెడు నక్షత్రాలు మినుకు మిణుకుమని మెరుస్తున్నాయి. 

“ఓహ్ ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు. ఆకాశంలోని నక్షతరాలన్నీ లెక్కపెట్టేస్తాను” అనుకుంది బుజ్జి కుందేలు. 

ఇలా లెక్కించసాగింది, “ఒక నక్షత్రం, రెండు నక్షత్రాలు, మూడు నక్షత్రాలు, నాలుగు….”

“ష్…. బుజ్జోడు నిద్రపోతున్నాడు. అల్లరి చేయకండి” అంది తల్లి కుందేలు. 

“నాలుగు…” అని నక్షత్రాల్ని లెక్కిస్తూ, మెల్లగా నిద్రలోకి జారుకుంది బుజ్జి కుందేలు. 

ఇదండీ మన మన బుజ్జి లెక్కల కుందేలు కథ. 

———————————————————————————————————————

“అపూర్వ రష్యన్ జానపద కథలు” నుండి ఈ కథ,స్వేచ్చానువాదం – అనిల్ బత్తుల   

మంచి కథలు బొమ్మలు ఉన్న పుస్తకం, ప్రింటింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కేవలం 200/- మాత్రమే.  

కాపీల కోసం 

Anil Battula

telugureadersclub@gmail.com

Mobile : 8179273971

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *