శీష్ రిలీజ్

Sheeshmahal

నాకెప్పుడూ ఒక “డ్రీమ్ రిలీజ్” ప్లాన్ ఉండేది, ఒక మల్టిప్లెక్స్ స్క్రీన్ ఒక సింగిల్ స్క్రీన్ లో నా సినిమా రిలీజ్ చేయాలని. చాలా సింపుల్ రిలీజ్, ఒకవేళ మంచి టాక్ వస్తే థియేటర్లు షోలు పెరుగుతాయి, లేదా రెండు స్క్రీన్ల ఖర్చుతో బయటపడిపోవచ్చు. ఇలా “అండర్ డాగ్ రిలీజ్” అయ్యి హిట్లు సంచలనాలు అయిన సినిమాలలో నాదీ ఒకటవుతుందనే పిచ్చి ఫాంటసీ కూడా ఇంకో కారణం. శీష్ మహల్ తో ఆ కోరిక తీరుతుందని కలలు కంటూ కంటూ కంటూ ఇంకేం కంటాలే అని, అయినప్పుడు అవుతుంది అయితే అవుతుంది లేకపోతే లేదు అనే జోన్ లోకి వచ్చేసాను. ఇది వైరాగ్యపు zone కాదు, very practical zone. రెండు మూడేళ్ళ క్రితమే థియేటిరికల్ రిలీజ్ మీద ఆలోచనలు ఆపేసా, డిజిటల్ రిలీజ్ చాలు. హ్యాపీస్ & ఫుల్ పీస్.

 తొమ్మిదేళ్ళుగా చాలానే తీసాం, మా పరంగా మేము సక్సెస్, హిట్టూ లేదు వైరల్ అవలేదు కానీ సినిమాలు తీయడానికి ఎవరో ఒకళ్ళు దొరుకుతూనే ఉన్నారు, అదే మా సక్సెస్.  ఏదో ఒకటి తీస్తూ బతికేస్తున్నాం, ఇంకో పక్క  బెటర్ బడ్జెట్స్ అంటే కోటి రెండు కోట్ల మధ్యలో తీయగలిగే కథలు అనుకుంటున్నాం రాస్తున్నాం పిచ్ చేస్తున్నాం నెరేట్ చేస్తున్నాం, ఏం వర్కౌట్ అవడం లేదు, అవుతాయేమో, అదెప్పుడనేది ఒక మిరాకిల్. ఇండిపెండెంట్ నిర్మాతలతో OTT లతో డీల్ చేయడం ఒక ఆర్ట్, దానిమీద మాకింకా ‘గ్రిప్’ రాలేదు. 

ఇలా గడచిపోతున్న మా లైఫ్ లోకి శీష్ మహల్ రిలీజ్ ఆఫర్ వచ్చింది, పోయిన సంవత్సరం, ఈ ఊహించని పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అయు, నిలదొక్కుకుని, ఉత్సాహంగా ఐదు ప్రైవేట్  స్క్రీనింగ్స్ వేసాం, అన్నీ హౌస్ఫుల్సే. నచ్చిన వాళ్ళు మాతో చాలాసేపు మాట్లాడారు, కొందరు హగ్గులిచ్చారు, నచ్చని వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు. మేజర్ గా పాజిటివ్ టక్ అయితే వచ్చింది. ప్రివ్యూ థియేటర్లో టాకుని నమ్మకూడదు అని గట్టిగా ఫిక్స్ అయిన నాకే జనాల రెస్పాన్స్  చూసి బిస్కెట్ తిన్నా. నాకన్నా ఎక్కువ అవాక్కైంది  రోహిత్, తొమ్మిదేళ్ళుగా ఆ సినిమాని తన ఎడిట్ంగ్ లో  చూసి చూసి చూసి శీష్ మహల్ మీద ఒక రకమైన విరక్తిలోకి వెళ్ళిపోయాడు రోహిత్, స్క్రీనింగ్స్ తర్వాత ఆ విరక్తి తగ్గింది.

వారం రోజుల్లో రిలీజ్ చేస్తారా  , పది హైదరాబాద్ పది  US స్క్రీన్లు అని ఆఫర్ వచ్చింది. మరీ వారం రోజుల్లోనా ? ఇది అసాధ్యం, సెన్సార్ అవలేదు, ప్రమోషన్ చేయాలి, దానికి డబ్బులు కావాలి, రెండు వారాలు టైం అడిగాం,  ఆ ప్లాన్ ప్రకారం లాస్ట్ డిసెంబర్లో  అవాల్సింది, మేమెంత ప్రయత్నించినా అది జరగలేదు. కానీ ఆ ప్రెజర్ వల్ల రిలీజ్ కి చేయాల్సిన పనులన్నీ చేసేసాం, అందులో అత్యంత ముఖ్యమైనది CENSOR, ఈ ప్రాసెస్ మీద ఇంకో వ్యాసం రాస్తా. 

రాగల రోజుల్లో, అంటే ఈ సంవత్సరమే  శీష్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి, నేననుకున్న “డ్రీం రిలీజ్” కాకపోయినా రిలీజ్ అయితే చాలు, just for fun. రిజల్ట్ ఏమవుతుందో అనే భయం అస్సలు లేదు, శీష్ రిలీజ్ చేయటమే మాకు బ్లాక్ బస్టర్ ఫీలింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *