Raata

సినిమా కథలు రాయటం కష్టమా ?

కష్టమే, ఏ ‘రాత’ అయినా కష్టమే, ఒక్కోసారి ఎవరికైనా పేద్ద వాట్సాప్ మెసేజ్ రాయడం కూడా కష్టమే. ఎందుకు కష్టం? రాయటం అంత ఈజీ కాదు కాబట్టి. సినిమా కథలు అనేది మరీ కష్టం, నేను సినిమా వాణ్ని కాబట్టి మా   కష్టాల గురించే రాస్తా. చాలా రోజులైంది బ్లాగ్ రాసి, ఏమన్నా రాద్దాం అని కూర్చుని ఈ రాత మొదలుపెట్టా. రేయ్ పాయింట్ కి రా అనుకుంటున్నారా, రాను, మొత్తం ఇలా  మెదడులో ఏమనిపిస్తే అది రాస్తా. ఇలా అనిపించింది రాసినట్టు సినిమా కథలు సీన్లు కూడా వస్తే ఎంత బాగుంటుంది, వస్తాయి అప్పుడప్పుడు, లేదా నెలల తరబడి రావు THOUGHTS. ఇది mostly నా వ్యక్తిగత వేదన, నాకు  రోజూ రెండు మూడు ఐడియాస్ వస్తుంటాయి, కొన్ని రాయాలనిపిస్తాయి కొన్ని అలా బ్రెయిన్ లోనే తిరుగుతుంటాయి. ఎందుకు రాయలేను? దానికి కారణం ఏంటి అనేది దశాబ్దం కింద నా ఫ్రెండొకడు చెప్పాడు “PROCRASTINATION’ – నువ్వు చేయాలనుకున్న పని ఇంకా టైముంది కదా చేయొచ్చులే అని కోర్టు వాయిదాల్లాగా వాయిదా వేస్తూ పోవడం, దానికి కారణం నీకు ఆ పని మీద ఇంటరెస్ట్ లేకపోవటం or నువ్వు బద్దకస్తుడివి, అని విడమరిచి examples తో explain చేసాడు. అలా ఆ పదం పరిచమైంది, ఆలోచిస్తే అవును నేను చిన్నప్పట్నుంచి అంతే కద, పరీక్షలు దగ్గరకొచ్చేదాకా చదవకపోవడం నుంచి ఇంకా చాలా విషయాలు గమనించా నాలో.  అప్పట్నుంచి నాకు PROCRASTINATION అనే జబ్బుంది నేనేం చేయలేను అని ఫిక్స్ అయిపోయి బతికేస్తున్నా. ఇది కేవలం రాయటం గురించే కాదు స్నానం చేస్తే ఫ్రెష్షుగా ఉంటుంది అని తెలిసినా, ఆ చేద్దాంలే అనిపిస్తుంది, అలవాట్లు వ్యసనాలు మార్చుకుందాం అనుకుంటే, రేపట్నుంచి చేద్దాంలే అనే జబ్బు. 

అలాగని నేనేం రాయనా అంటే విపరీతంగా రాసాను గత పదేళ్లలో, వంద ఆర్టికల్స్ రాసుంట, fb insta లో విపరీతంగా పోస్టులు రాసా, అవి నాకు appreciation ఎంత తెచ్చాయో అదే రేంజ్ లో ద్వేషం అసహ్యం కూడా తెచ్చాయి. అడ్డూ అదుపూ లేని expressionism, show off చేయాలి, జనాల్ని బజ్ లో ఉంచాలి పిచ్చెక్కించాలి ఖండించాలి సామాజిక విషయాల మీద నా టాలెంట్ చూపించాలి,  ఇలా social media యుగంలో platforms దొరికాయి కదా అని చెలరేగిపోయాను. అదొక addiction, ocd, ఎక్కువ చేస్తే ఏదైనా జబ్బే. నాకున్న లక్షణాలని గూగుల్ లో టైప్ చేస్తే, అదొక mental disorder అని దానికేదో పేరు కూడా ఉంది. Social media రాతలు చాలు ఈ విపరీతోద్యమాన్ని ఆపేద్దాం అని బయటకొచ్చేసా, ప్రశాంతంగా ఉంది, పర్లేదు నాకు ఈ మాత్రం will power ఉంది అని ఆనందంగా ఉంది. 

అంత రాసేవాణ్ణి సినిమా కథలు సీన్లు ఎందుకు రాయలేను? అవి కూడా రాస్తా , కానీ full version అనేది ఎప్పటికీ రాయను, scene order రాస్తా, అలా రాస్తున్నప్పుడు కొన్ని సీన్లు detailed గా రాస్తా, but never a full script, నా వల్ల అవదేమో అనిపిస్తుంది, నేను రాయలేకపోవడమేంటి తల్చుకుంటే రోజుకి పది సీన్లు రాస్తా, ఇలా కూడా అనిపిస్తుంది, ఇది జబ్బే. “శీష్ మహల్” షూటింగ్ జరిగిన విధానం వల్ల improv అనే దాంట్లోకి వెళ్లిపోయిన నేనూ రోహిత్ దాంట్లోంచి బయటపడలేకపోతున్నాం. నేను ఓపిక చేసుకుని ఒక్క script రాస్తే మాకు సినిమానో వెబ్ సీరీసో ఎప్పుడో ఓకే అయిపోయేది, మా దరిద్రాలు కూడా తీరిపోతాయని తెల్సినా నేను రాయను, అనిపించినపుడు రాస్తా అంతే . ott లకి pitch చేయాలంటే చాలా detailed కథ screenplay మాటలు రాయాలి, అది తల్చుకుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది, అంతా రాసినాక వాళ్ళ మార్పులు చేర్పులు తీర్పులు ఉంటాయి, అన్ని కోట్లు ఇచ్చేవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఏంటి చాలా చెప్పాలి, మనకేమో అవి పడవు, మరి ఇప్పుడెలా ? తప్పదు రాయాల్సిందే, నీ దగ్గర డబ్బులు లేనపుడు నువ్వు వాడి మాట వినాల్సిందే. 

నా గూగుల్ డ్రైవ్ లో ఎన్ని unfinished కథలు ఉంటాయంటే, కొన్నిటికి అయితే just title ఉంటుంది. రాసినవి కొన్ని రోజుల తర్వాత చదివితే ఒకోసారి చిరాకొస్తుంది, ఏం రాసాను నేను అని, ఒకోసారి బానే రాసానే అనిపిస్తుంది. ఏదన్నా రాసినపుడు అది బాగా వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, just భావప్రాప్తి feeling. రోహిత్ నాతో వారానికి ఒక్కసారైనా అంటుంటాడు, “you are lucky man, తెలుగులో ఎంత బాగా రాయగలవు, writing కన్నా exciting ఏముంటుంది, You can  just get lost in that process” అని, నాకూ రోహిత్ ఎడిటింగ్ talent మీద అదే ఫీలింగ్, actually కుళ్ళు. Editing లో కథ form చేయటం అంటే keyboard తో రాసినట్టే, but writing is tough. 

రాయటంలో అత్యంత కష్టమేంటంటే “మొదలు పెట్టడం”, పెన్నూ పేపర్ ముందేసుకుని కూర్చుంటా లేదా laptop లో draft ఓపెన్ చేసి కూర్చుంటా చాలాసార్లు mobile లో రాస్తా, ఈ మూడింటిలో నేను mobile లోనే చాలా ఫాస్టుగా చాలా detailed గా రాయగలను, అలా ఎందుకు జరుగుతుందో మరి. పేపర్ laptop screen ని చూస్తుంటే అదొక intimidating ఫీలింగ్, కమాన్ రాయి రా అని అవి ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంటుంది. అలాగని మొబైల్ లో రాద్దామంటే వేళ్ళు మెడల నొప్పులు, వయసైపోతోందిగా. ఎటెటో వెళ్ళిపోతున్నా, yes, మొదటి లైన్ రాయడమే big task, చెయ్యి కదలదు, నేను పాటలు కూడా రాస్తుంటా కద, ఆ మొదటి లైన్ కోసం పడే తపన మామూలుగుండదు. first line ఇచ్చే push తో ఎంతో కొంత రాయచ్చు, అదే వచ్చి సావదే, writer’s block అనుకోండి ఇంకేమైనా అనుకోండి. 

రాయటంలో ఇంకో సమస్య repetition, రాసింది చదివితే “అబ్బా ఇన్ని repetitions ఉన్నాయేంటి” అని irritating గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను రాస్తున్న ఈ వ్యాసంలో కూడా ఉన్నాయి, నేనేం చేయలేను, మళ్ళీమళ్ళీ చదివి సరిచేసే ఓపిక లేదు. 

కథంటే only కథ కాదు ఇంకా చాలా ఉంటాయి  structure, characterisation,inciting incident three act structure, high point, treatment, వీటి గురించి నేను ఆలోచించను flow లో రాసుకుంటూ పోతా, నాకు తెలిసిన వచ్చిన పధ్దతి ఇదే. డైలాగులు రాయాలంటే నీరసం వస్తుంది, దీని గురించి ఇంకో పొడుగు వ్యాసం రాయచ్చు. 

కొంతమంది ఎంత రాస్తారంటే, కుళ్ళు పుడుతుంది, అది ఎలాగైనా ఉండని రాయటం ముఖ్యం. ఇంక విపరీత రాతల మనుషులుంటారు, వాళ్ళు చెప్పేవి నమ్మబుద్ధి కాదు, చాలా రోజుల క్రితం నాకో ఫ్రెండ్ కలిసి తన finish అవుతున్న సినిమా గురించి చెప్తూ 117 డ్రాఫ్టులు రాసాను ఈ కథకి అన్నాడు,  whattttttttt, అనుకున్నా, సినిమా రిలీజ్ అయింది, flop అయింది. దీన్ని నేను నెగటివ్ గా ఏం చెప్పడం లేదు, అంత రాస్తే కథ dilute అయిపోయిన ఫీలింగ్ రాదా ? ఒకటే పెగ్గులో నీళ్లు నింపుతుంటే ఎంత పల్చబడి పోతుంది? ఎక్కదు కూడా, నాకు కథ విషయంలో అదే అనిపిస్తుంది, సరే అతనికి అంత passion excitement అన్నిటికీ మించి ఓపికుంది. 

కొన్ని కథల విషయంలో ఏం జరుగుతుందంటే, డైరెక్టర్ తన రైటర్/రైటర్స్ తో కలిసి convincing గా ఉండాలని బోలెడు సీన్స్ రాసి అన్నీ తీస్తాడు, ఎడిటింగ్ దగ్గరకి వచ్చాక ప్రతి సీను అవసరమే అనిపిస్తుంది, సినిమా లెంగ్త్ మూడున్నర నాలుగు గంటలు, ఇప్పుడేం తీసేయాలి అనే డైలమాలో పడిపోతాడు డైరెక్టర్, ఇవి అవసరం లేదు అని సీన్లు లేపేస్తే కథ అర్ధం కాదేమో అనే భయం. ఫైనల్ గా సినిమాని రెండు రెండున్నర గంటలకి తీసుకొస్తారు, డైరెక్టర్ భయపడినట్టుగానే అది కలగాపులగం అయిపోతుంది, చాలా rare గా అంత లేపేసినా బాగుండే సినిమాలు ఉంటాయి. గంట గంటన్నర సినిమా ఎడిట్ లో లేచిపోయిందంటే అంత చేసిన షూటింగ్ waste అన్నట్టేగా, అన్ని డబ్బులు అనవసరంగా ఖర్చయినట్టే. ఇన్నే సీన్లు ఉండాలి అనే judgement ఎలా వస్తుంది ? తెలియదు

Bound script ఉండాల్సిందే రెగ్యులర్ నిర్మాతకి దర్శకుడికి,  ఇలాంటి కథ ఎట్లా ఒప్పుకున్నాడు నిర్మాత అనే డౌట్  చాలాసార్లు వస్తుంటుంది, ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది అని ఒక గుడ్డి నమ్మకం, అది ఒకోసారి వర్కౌట్ అవుతుంది అక్కడ్నుంచి నిర్మాతకి “నేను కథలు బాగా జడ్జ్ చేయగలను” అనే confidence వచ్చేస్తుంది, దర్శకుడిదీ same feeling అనుకోండి. 85% సినిమాలు ఫ్లాపులు, point బాగుంది, కథ కూడా ఇంటరెస్టింగ్ గానే ఉంది కానీ సీన్లు పండలేదు అనే రివ్యూస్ opinions common.  ఎలా పండించాలి సీన్లని, bound script తీసుకెళ్లి గడ్డిలో మాగ పెడితే పండుతాయేమో. “Agent” సినిమా bound script లేకుండా షూటింగ్ కి వెళ్లిపోయారని చదివి, ఎలా సార్ ఎలా ? అన్ని కోట్లు ఖర్చుపెడుతూ ఏ confidence తో షూట్ కి వెళ్లారో?

ఇంత రాస్తారు కదా మనోళ్లు  మరి కథుండదేంటి మన సినిమాల్లో, వచ్చిన కథలే వస్తుంటాయి, చూసిన సీన్లే చూస్తుంటాం, ఎందుకిలా ? అస్సలు కొత్త కథలు రావడం లేదు అని నేను అనటం లేదు, but yeah మెజారిటీ రొట్ట కథలే. ప్రతొక్కడు కొత్త కథే రాస్తున్నా అనుకుంటాడు, కొత్త పాయింట్లు కూడా వెతికి పట్టుకుని ఇది unique అని ఫీల్ అయి దాని మీద రీసెర్చ్ చేసి మరీ రాస్తారు, కానీ అది సినిమాగా మారేసరికి ఇంకో రకంగా తయారవుతుంది. నాకొక young director తెల్సు, కథ ఒప్పించుకుని షూటింగ్ కూడా అయిపోయి ఇప్పుడు final stages లో ఉంది, ట్విస్ట్ ఏంటంటే తను అనుకున్నది female oriented story అయిపోయే సరికి అది male oriented అయిపోయింది, ఏదో ఒకటిలే అన్నా డైరెక్టర్ అయితే అయిపోయాను అని వాడి ఫీలింగ్. 

ఎన్ని hollywood screenwriting గురువులు చెప్పినవి విన్నా రాసిన పుస్తకాలు చదివినా “perfect script” వస్తుంది అనేది భ్రమ, no doubt కొన్ని techniques తెలుస్తాయి, end of the day నీలో రచయితే బయటకొస్తాడు, నీతో ఏది పడితే అది రాపిస్తాడు. 


మరి నేను కథ screenplay డైలాగులు రాయకుండా మాకు డబ్బులు ఎవరిస్తారు? ఏమో, నా దగ్గర జవాబు లేదు, జరిగినపుడు జరుగుతుందిలే అనే ధోరణి. లేదు నేను రాస్తా త్వరలోనే ఒక పూర్తి script రాసే ప్రయత్నం పక్కా చేస్తా, మాకూ ఎప్పట్నుంచో improv కాకుండా ఒక written fiction చేయాలనుంది. ఒకవేళ మీరు ఇక్కడిదాకా చదివి ఉంటే, నా writing నచ్చి ఉంటే, కింద qr code ఉంది దానికి ఎంతో కొంత కొట్టేయండి, remuneration అనుకోండి, అసలే writers కి డబ్బులు సరిగ్గా ఇవ్వరని తెల్సుగా. మీ నుంచే వచ్చే ఆర్ధిక స్పందన నాలో రచయితని బయటకి తెస్తుందేమో, encourage చేయండి బ్రో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *