Amma cheti vanta

అమ్మచేతి వంట


ఈరోజు ఏం వండుకోవాలని లేదు, కుక్కర్లో రైస్ పెట్టేసి అల్లం పచ్చడి పెరుగుతో లంచ్ ముగించేయొచ్చు. బద్దకమా? అలాంటిదే, రోజూ వండాలా ? ఒక్కరి కోసం వండుకోవటం ఒక్కోసారి వద్దనిపిస్తుంది. నేను ఫ్రెండ్స్ తో ఫ్లాట్ లో ఉంటున్నప్పుడు అమ్మతో మాట్లాడినపుడు “తిన్నావా”? అని అడగాలి కద అడుగుతా “ఒక్కదాని కోసం వండుకోబుద్దికాలేదు” అనే మాట చాలా సార్లు విన్నా, అదేమిటో ఇప్పుడు అర్ధమవుతోంది. దశాబ్దాలుగా వండి వండి అయినా విరక్తి రాని అమ్మలు ఇతర ఆడవాళ్ళు మీకు హ్యాట్సాఫ్. మగవాణ్ణి వంటింట్లోకి పోనివ్వకుండా రానివ్వకుండా చేసిన మన సంస్కృతి మనకి చాలా అన్యాయం చేసింది అనిపిస్తుంది. వంట వచ్చిన మగాళ్లని చూస్తే కుళ్ళు నాకు, బ్రాందీ తాగుతూ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా వండేసే నాలాంటి uncles ఎంత కూల్ అనిపిస్తారో. గర్ల్ ఫ్రెండ్ తో మొబైల్ లో ముచ్చట్లు పెట్టుకుని తనకేం కావాలో వండుతూ, ఆహా ఏమి రొమాన్స్ అది. నా యవ్వనంలో ఇది మిస్ అయ్యానే అనే బాధ. పర్లేదు ఎప్పటికైనా గర్ల్ ఫ్రెండ్ ని సంపాదించి తనకి నేను వంట చేసి పెట్టే స్టేజ్ కి రావాలి.

ఐదు నెలల క్రితం అమ్మ అమెరికా వెళ్ళింది చెల్లి దగ్గరకి, ప్రతి అమ్మలాగే మా అమ్మ బెంగ కూడా అదే, “పెళ్ళి అవలేదు, వంట రాదు ఏం తింటాడో ఏంటో” అని. ఈసారి ఫిక్స్ అయ్యా నా జీవితకాల కోరిక నెరవేర్చుకోవడానికి, అదే వంట నేర్చుకోవటం, నేను ఒంటరిగానే బతకాలి అనుకున్నా, దానికోసం వంట నేర్చుకోవాలి అనుకుంటూ 48 ఏళ్ళకి వచ్చా. అమ్మ వెళ్లిన రెండోరోజు వంట ప్లాన్ అమలుపరచడం మొదలుపెట్టా, ఇంతకుముందు కూడా ప్రయత్నించా కానీ ఫెయిల్ అయ్యా, ఈసారి అవదల్చుకోలేదు. యూట్యూబ్ లో “అమ్మ చేతి వంట” ఛానెల్ ఫాలో అవుదాం అని డిసైడ్ అయ్యా ఎందుకంటే మిగతా వాళ్ళ కంటే ఈ యూట్యూబర్ చాలా సింపుల్ గా తక్కువ టైంలో వంట చేసే వీడియోస్ పెడుతుంది, ఆమె చెప్పే ఐటమ్స్ అన్నీ మన ఇళ్లలో ఉండేవే.

మొదటి వంట పాస్ మర్క్స్ , రోటి పచ్చడి చేసుకుని వేలితో నాకి రుచి చూసా, బాగుంది కొంచెం ఉప్పు తగ్గింది అంతే, నెయ్యి వేసుకుని లాగించేసా. ఆ పూట నాకు కలిగిన ఆనందం అంతాఇంతా కాదు. బ్రహ్మానందం తనకి ఏవో పవర్స్ వచ్చాయి అనుకుంటూ ఎలా ఫీలవుతాడో అలా ఫీల్ అయ్యా. ఆరోజు నుంచి నా వంటల జర్నీ మొదలైంది, నాలుగు రోజులు గడిచేసరికి యూట్యూబ్ అవసరం లేకుండా వండే లెవెల్ కి వచ్చా. కాఫీ టిఫిన్ తో మొదలుపెట్టి రాత్రికి వేడివేడి చపాతీలు చేసునేంత, పల్చటి నాలుగు వేడి ఇడ్లీల్లో పల్లి చట్నీ నల్లకారం నెయ్యి వేసుకుని తినేసి డాబా మీదకెళ్ళి ఒక దమ్మేస్తుంటే “ఆహా మనం వండుకుని తింటే ఎంత బాగుంది, ఇన్ని రోజులు అలా చేసుకొనేందుకు రిగ్రెట్ అవకుండా ఇప్పటినుంచి బద్దకించకూడదు” అని మోటివేషన్ తెచ్చుకుని కిందకొచ్చి ఫ్రిడ్జ్ తీసి ఏం కూరగాయలు ఉన్నాయో బయటపెట్టుకుని, ఒక podcast ప్లే చేస్తూ కటింగ్ మొదలవుతుంది. అక్కడ్నుంచి ఒక గంట పైనే టైం పాసవుతుంది. నేను చాలా లో ఫ్లేమ్ లో కుక్ చేస్తా, మాడిపోవడం అనేది ఎంత కృంగతీస్తుందో గత అనుభవాలున్నాయి, ఆ మాడిన గిన్నె కడగలేక పారేసిన  సందర్భాలూ ఉన్నాయి.

ఈ ఐదు నెలల్లో ఇంట్లో లేనప్పుడు తప్ప బయట తిన్నది చాలా తక్కువ, బయట ఫుడ్ ఏది ఎక్కడం లేదు. ఇంకొక గొప్ప రియలైజేషన్ , ఇది నా ఇగ్నోరెన్స్ కూడా, కేజీ ఉల్లిపాయలు ఒక మనిషికి ఇన్ని రోజులు వస్తాయా అని మొదలై కూరగాయలు సరుకుల ధరలు ఇంత చీపా ఇంత కాస్ట్లీనా ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్న. ఉప్పు కారం ఎక్కువవుతాయేమో  అనే భయంతో జాగ్రత్తగా కొద్దికొద్దిగా వేస్తా, అది కూడా ఎక్కువే అనిపిస్తుంది ప్రతిసారి, కానీ అయ్యాక టేస్టు చూస్తే తక్కువే ఉంటాయి. ఈ లెక్కన మనం ఎంత ఉప్పు ఎంత కారం తింటున్నామో తిన్నామో తల్చుకుంటే, అంత అవసరం లేదేమో. 

ఫ్రెండ్స్ కి వండిపెట్టా, యావరేజ్ నుంచి  సూపర్ హిట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి కానీ ఫెయిల్ అవలేదు, వంట విషయంలో నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే. Thanks to “అమ్మచేతి వంట” ఛానెల్ . నాన్ వెజ్ ఇంకా ట్రై చేయలేదు, చేస్తా అది కూడా.

ఈరోజు ఏం వండుకోవాలని లేదు అనిపించిన పావుగంటలో పక్కింటి వంశీ వచ్చి పప్పుచారు చేస్తున్నా తెచ్చిస్తా అన్నాడు, చాలు ఇంకేం కావాలి. – Camp Sasi